ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 7:07 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

డిసెంబర్ 15 నాటికి భవనాలు, హాస్టల్‌తో పాటు మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని హామీ.

డిసెంబర్ 15 నాటికి భవనాలు, హాస్టల్‌తో పాటు మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని హామీ.

అర్జున్ సమాచారం | జగిత్యాల జిల్లా ప్రతినిధి | అక్టోబర్ 9:

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనను విరమించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అల్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇచ్చిన హామీతో విద్యార్థులు సమ్మెను విరమించి, తిరిగి తరగతులకు హాజరయ్యేందుకు అంగీకరించినట్లు సమాచారం.

కళాశాలలో తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా తరగతులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు.

విద్యార్థుల సమస్యలపై స్పందించిన మంత్రులు.. డిసెంబర్ 15వ తేదీలోగా వైద్య కళాశాల భవనం, హాస్టల్ భవనాలు, క్రీడా మైదానం, మెస్ తదితర మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

మంత్రుల హామీతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు. ఇచ్చిన హామీ మేరకు నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తిచేసి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. హామీల అమలుపైనే విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.